News
ఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
అమరావతి, ఆగస్టు 5 (బీబీఎంఏ న్యూస్): పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏసీబీ కేసులో చిక్కిన అధికారి ఏకా మురళిపై విధించిన సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయనను తిరిగి ప్రభుత్వ సేవల్లోకి తీసుకుంది.
ఈ ఏడాది జనవరి 24న లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసింది. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
సస్పెండ్ అయిన అధికారుల కేసులను జూలై 22న సమీక్షించిన కమిటీ, ఏకా మురళిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్, శాఖాపరమైన విచారణలకు ఈ నిర్ణయంతో ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఆయనను సుదూర ప్రాంతంలోని అప్రాధాన్య పోస్టులో నియమించాలని ఆదేశిస్తూ, తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగం ఎదుట హాజరుకావాలని సూచించింది.
News
లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ. భాస్కర్
ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఆదేశాలు
లక్షెట్టిపేట, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 5: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధులు, వివిధ రికార్డులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.
లక్షెట్టిపేట మీదుగా జాతీయ రహదారి వెళ్లే నేపథ్యంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో నమోదయ్యే సివిల్ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించాలని, భూ వివాదాల విషయంలో రెవెన్యూ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీ అనంతరం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తున్నారని డీసీపీ ఎ. భాస్కర్ అభినందించారు.
News
టీబీజీకేఎస్‌లో చేరిన 16 మంది కార్మికులు
సింగరేణిలో కార్మిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన మిర్యాల రాజిరెడ్డి
మందమర్రి / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5:
మందమర్రి సివిల్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సమక్షంలో 16 మంది కార్మికులు ఏఐటీయూసీ నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో చేరారు. వారికి యూనియన్ నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాల కల్పన జరగక కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, బదిలీలు వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని, సింగరేణి అభివృద్ధికి కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సివిల్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, బండి సదానందం, ఎండి సముద్దీన్, వి. రాజయ్యతో పాటు మొత్తం 16 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఓ. రాజశేఖర్, సీహెచ్ వెంకట్ రమణ, బెల్లం అశోక్, మేడిపల్లి సంపత్, గాలిపెల్లి తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.
News
మంథని ప్రధాన రోడ్లు పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయా?
రోడ్లపై భారీ వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు – ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రజల డిమాండ్
మంథని / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5:మంథని పట్టణంలో కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రస్తుతం అక్రమ పార్కింగ్‌కు కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీపాద చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సీఆర్‌కే అపార్ట్‌మెంట్, పాత పెట్రోల్ బంక్, బస్ డిపో పరిసరాల్లో మినీ వ్యాన్లు, డీసీఎం వ్యాన్లు, ఇతర వాహనాలను రోడ్డుపైనే గంటల తరబడి నిలిపివేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు ఇరుకైన మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు సకాలంలో వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోతోందని ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమ పార్కింగ్‌పై మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోడ్డుపై వాహనాలు నిలిపే వారిని హెచ్చరించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించి అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని స్థానికులు పోలీసు, మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
-
crime3 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
News3 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
Telangana4 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
Entertainment3 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News4 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News4 weeks agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
-
News6 days agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
