Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

మంథని ప్రధాన రోడ్లు పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయా?

Published

on

రోడ్లపై భారీ వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు – ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రజల డిమాండ్

మంథని / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5:మంథని పట్టణంలో కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రస్తుతం అక్రమ పార్కింగ్‌కు కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీపాద చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సీఆర్‌కే అపార్ట్‌మెంట్, పాత పెట్రోల్ బంక్, బస్ డిపో పరిసరాల్లో మినీ వ్యాన్లు, డీసీఎం వ్యాన్లు, ఇతర వాహనాలను రోడ్డుపైనే గంటల తరబడి నిలిపివేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు ఇరుకైన మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు సకాలంలో వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోతోందని ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమ పార్కింగ్‌పై మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోడ్డుపై వాహనాలు నిలిపే వారిని హెచ్చరించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించి అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని స్థానికులు పోలీసు, మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ. భాస్కర్

Published

on

ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఆదేశాలు

లక్షెట్టిపేట, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 5: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పరిపాలనా విధులు, వివిధ రికార్డులు, నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.

లక్షెట్టిపేట మీదుగా జాతీయ రహదారి వెళ్లే నేపథ్యంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

వర్షాకాలంలో నమోదయ్యే సివిల్ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించాలని, భూ వివాదాల విషయంలో రెవెన్యూ శాఖ అధికారుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై అత్యంత సున్నితంగా స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తనిఖీ అనంతరం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంతృప్తికరంగా విధులు నిర్వహిస్తున్నారని డీసీపీ ఎ. భాస్కర్ అభినందించారు.

Continue Reading

News

టీబీజీకేఎస్‌లో చేరిన 16 మంది కార్మికులు

Published

on

సింగరేణిలో కార్మిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన మిర్యాల రాజిరెడ్డి

మందమర్రి / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5:

మందమర్రి సివిల్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సమక్షంలో 16 మంది కార్మికులు ఏఐటీయూసీ నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో చేరారు. వారికి యూనియన్ నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు.

 

ఈ సందర్భంగా నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాల కల్పన జరగక కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, బదిలీలు వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని, సింగరేణి అభివృద్ధికి కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

సివిల్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, బండి సదానందం, ఎండి సముద్దీన్, వి. రాజయ్యతో పాటు మొత్తం 16 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఓ. రాజశేఖర్, సీహెచ్ వెంకట్ రమణ, బెల్లం అశోక్, మేడిపల్లి సంపత్, గాలిపెల్లి తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Published

on

సింగరేణి హెచ్‌ఓడీ అధికారులకు సైబర్ భద్రతపై అవగాహన – మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచన

రామగుండం / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5:”సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్‌లో సింగరేణి హెచ్‌ఓడీ అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్టాక్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ–కేవైసీ మోసాలు, నకిలీ లింకులు, ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ మోసాలపై అధికారులు వివరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సైబర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, పాల్గొన్న వారితో సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ప్రస్తుతం నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 30 శాతం ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌కు సంబంధించినవేనని, అధిక లాభాల పేరుతో ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.

తెలియని లింకులు, అనుమానాస్పద యాప్‌లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆహ్వానాలను నమ్మొద్దని, “ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు” అని చెప్పే వ్యక్తుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని, సంస్థలోని ప్రతి ఉద్యోగికి సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ వాయిస్ కాల్స్, సోషల్ మీడియా మోసాల విషయంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, రామగుండం సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, సైబర్ క్రైమ్ అధికారులు, సింగరేణి హెచ్‌ఓడీ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending