Politics
అంధ క్రికెటర్ల వేదనకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ — మాటిచ్చిన 24 గంటల్లో సాయం, అభివృద్ధి చర్యలు
అంధ క్రికెటర్ల వేదనకు చలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
•జట్టు కెప్టెన్ దీపిక, సభ్యురాలు పాంగి కరుణ కుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•24 గంటల్లో ప్రపంచకప్ విజేతల కుటుంబాలకు గృహోపకరణాలు
•అంధ క్రికెటర్ల ఇళ్లలో వస్తు కాంతులు
•తంబలహట్టి తండా, వంట్ల మామిడి గ్రామాలకు వెళ్ళి అందించిన జనసేన నాయకులు, యంత్రాంగం
•నూతన గృహాల నిర్మాణంపై పర్యవేక్షించాలని పేషీకి దిశానిర్దేశం
•ఇప్పటికే కెప్టెన్ దీపిక స్వగ్రామానికి రూ.6.2 కోట్లతో రెండు రోడ్లు మంజూరు
ఎవరు సమస్య చెప్పుకున్నా మనసు పెట్టి విని, స్పందించి తక్షణ పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేసే నాయకుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది ప్రభుత్వపరంగా చూపే పరిష్కారం అయినా, వ్యక్తిగతంగా ఇచ్చే భరోసా అయినా గంటల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటారు. కష్టం వింటే కరిగిపోతారు. అంధుల క్రికెట్ లో ప్రపంచ విజేతలుగా నిలిచిన మహిళా జట్టు సభ్యులను కలసిన సందర్భంలో వారి కుటుంబాల దైన్య స్థితి విని చలించిపోయారు. మ్యాచ్ ఫీజుతో కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామన్న జట్టు కెప్టెన్ దీపిక మాటలకు చలించిపోయారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణ కుమారి కుటుంబాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడిలో కరుణ కుమారి కుటుంబానికీ టీవీ, టేబుల్ ఫ్యాను, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేటులు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్.ఇ.డి. బల్బులు, పాత్రలు, దుప్పట్లు, దిండులు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరకులు లాంటివి అందించారు. కెప్టెన్ దీపిక కుటుంబానికి అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ శ్రీ టి.సి. వరుణ్, శ్రీ పొదిలి బాబూరావు, శ్రీ కుమ్మరి నాగేంద్ర, శ్రీ ఆకుల ఉమేశ్, శ్రీ అంకె ఈశ్వరయ్య, డి.మణిప్రియ, శ్రీమతి శ్రీదేవి, శ్రీ ఆనంద్ తదితర జనసేన నేతలు తంబలహట్టి తండాకు వెళ్లి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన వస్తు సామాగ్రిని అందజేశారు. పాడేరు ఘాట్ రోడ్డులోని వంట్లమామిడి గిరిజన గ్రామంలో నివసిస్తున్న కరుణకుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరు గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, జనసేన నేతలు శ్రీ పి.శివ ప్రసాద్, శ్రీ కె.రామారావు, శ్రీ ఎన్ మురళీకృష్ణ చేతుల మీదుగా అందించారు.
•మధ్యాహ్నం మాటిచ్చారు.. సాయంత్రానికి రోడ్లు మంజూరు చేశారు..
శుక్రవారం మధ్యాహ్నం జట్టు శ్రీ పవన్ కల్యాణ్ గారిని కలిసిన సందర్భంలో దీపిక మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం పరిధిలోని తమ ఊరికి వెళ్లే రెండు రహదారులు ప్రయాణానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఆమె మాటలు విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు రహదారులు మంజూరు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కదిలిన అధికారులు హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహట్టి తండా రోడ్లను పరిశీలించారు. హేమవతికి వెళ్లే రహదారికి రూ. 3.2 కోట్లు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ. 3 కోట్లు అవసరం అని అంచనాలు రూపొందించారు. ఈ రెండింటికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు.
•24 గంటల్లో నూతన గృహోపకరణాలు, నిత్యావసరాలు ఏర్పాటు
దీపిక, కరుణ కుమారి వేదనకు చలించిపోయి వారి కుటుంబాలకు గృహోపకరణాలు, నిత్యావసరాలను తక్షణమే సమకూర్చాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు వాటిని కొనుగోలు చేసి ఆయా కుటుంబాలకు పంపించారు. ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి తగిన విధంగా డైనింగ్ టేబుల్స్, మంచాలు లాంటి మరికొన్ని గృహోపకరణాలు సమకూర్చాలని నిర్ణయించారు.
News
మేదరుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక దృష్టి
వెదురుతో చేతివృత్తులు, డెకరేషన్ రంగంలో పనిచేసేవారిని ఆదుకుంటాం: డీఎన్‌టీ బోర్డు కమిటీ సభ్యుడు భరత్ బాయ్
హైదరాబాద్, బిబిఏంఏ న్యూస్, ఆగస్టు 11:
వెదురుతో పనిముట్లు తయారు చేసే మేదరులు, డెకరేషన్ రంగంలో పనిచేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుందని కేంద్ర డీఎన్‌టీ డెవలప్‌మెంట్ బోర్డు కమిటీ సభ్యులు భరత్ బాయ్ తెలిపారు. నాగోల్‌లోని ఈషా ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భరత్ బాయ్ మాట్లాడుతూ వెదురుతో పనిముట్లు తయారు చేసే, డెకరేషన్ పనులు చేసే మేదరులను డీఎన్‌టీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సీడ్ పథకం ద్వారా అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని, మేదరులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి డెకరేషన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నందికంటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ మాట్లాడుతూ మేదరుల కులవృత్తికి సమాజంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అందరూ సంఘటితమై ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ బీసీల అభివృద్ధికి కుల సంఘాల నాయకులు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు రావినూతల శశిధర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు కులవృత్తులు చేసే వారు మూలస్తంభాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో డెకరేషన్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఎస్‌బీఐ ఏజీఎం రామకృష్ణుడు డెకరేషన్ కార్మికులకు ప్రమాద బీమా, ఎస్‌బీఐ బీమా పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డెకరేషన్ కార్మికులకు లేబర్ కార్డు రిజిస్ట్రేషన్ నిర్వహించి, ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీఎంఎండీవీ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఇందూరు గంగాధర్, డెకరేషన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతకోటి భిక్షపతి, కోశాధికారి పారాసాని ఈశ్వర్, ఉపాధ్యక్షులు, డీఎన్‌టీ నాయకులు, సంఘం ప్రతినిధులు, డెకరేషన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
News
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. శంకర్ గౌడ్ డిమాండ్
ఉద్యమకారుల హక్కుల కోసం మరోసారి గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల సమితి
గోదావరిఖని, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖనిలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారులంతా పార్టీలు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర, జిల్లా మహిళా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా అనుముల కళావతి, కార్యదర్శిగా తోడేటి స్వరూప, ఉపాధ్యక్షులుగా కోడిపుంజుల జ్యోతి, గంగారపు శాంతలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షురాలిగా మేకల సరోజన, కార్యదర్శిగా పున్నం మంజులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
News
మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించారు. మొదటి రోజు దీక్షకు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.
దీక్షకు ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
దీక్షలో లక్కా శ్రావణ్ గౌడ్, పార్తపల్లి హరీష్ యాదవ్, ఉస్మాన్, మోత్కూరి రవికుమార్, ఆవుల రవి తదితర బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News5 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
